top of page
Writer's pictureSriswamypoornananda.org

||శ్రీ బ్రహ్మానంద గురవే నమః|| - 3


శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు తిరుచందూర్ లోని సంసృత పాఠశాల లో విద్యను అభ్యసించే రోజులలో అక్కడ వారి తోటి విద్యార్థి అయిన శ్రీ హరిహరన్ గారు స్నేహితులయ్యారు. శ్రీ హరిహరన్ గారు తిరునెల్వేలి జిల్లాకు చెందిన కల్లడైకురిచి అనే ఒక గ్రామానికి చెందిన వారు. కల్లడైకురిచిలో, శ్రీ విద్యా పరంగా గురువులైన శ్రీ నీలకంఠ దీక్షితులు గారి కుమారులే శ్రీ హరిహరన్ గారు. శ్రీ హరిహరన్ గారు శ్రీ సుబ్రమణ్య శాస్త్రివారిని కల్లడైకురిచి వచ్చి వారి పితామహులను దారిసంచుకోవలసిందిగా ఎప్పుడు అడుగుతూ ఉండేవారు. అలా ఒకసారి శ్రీ హరిహరన్ గారితో కలిసి శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు కల్లడైకురిచికి వెళ్లి అక్కడ ఒక మూడు రోజులు శ్రీ హరిహరన్ గారి కుటుంబంతో గడిపి, శ్రీ నీలకంఠ దీక్షితులు గారిని దర్శించుకున్నారు. శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి వినయ, విధేయతలను చూసి ఎంతో సంతోష పడిన శ్రీ నీలకంఠ దీక్షితులు వారు, ఎంతో ఆత్మీయభావంతో, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారితో,

" నీవు సాక్షాత్తు ఆ జగన్మాత ముద్దు బిడ్డవు, సమయమొచ్చినప్పుడు మా ద్వారా నీకు శ్రీ విద్యోపదేసం అవుతుంది. త్వరలోనే మా నుండి నీకు పిలుపు వస్తుంది. నా కుమారుడైన హరిహరన్ ను మా కోసం, నీ సొంత సోదరుడిలా భావించి, అతడికి సన్మార్గాన్ని నిర్దేశించు."

అని చెప్పారు.


తిరుచందూర్ లో ప్రాథమిక విద్యను అభ్యసించిన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు, ఆ తరువాత మద్రాసులో శ్రీ హరిహరన్ అయ్యర్ గారి ఇంట్లో నివాసముంటూ, మైలాపూర్ సంస్కృత కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. వేదాంతం, మీమాంస, ఉత్తరమీమాంస శాఖలలో ఉత్తీర్ణత సాధించిన శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు ఆ విధముగా 'శాస్త్రి' అనే నామాలంకరణమును వారి ఉన్నత విద్య ద్వారా పొందారు. వారి అసలు పేరు శ్రీ సుబ్రమణ్య అయ్యర్. శ్రీ హరిహరన్ గారు కూడా అదే కళాశాలలో వేరే ఒక శాఖ లో ఉన్నత విద్యను అభ్యసించి వారు కూడా 'శాస్త్రి' అనే నామాలంకారాన్ని పొందారు.


శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు మైలాపూర్ సంస్కృత కళాశాల లో చదువుకుంటున్న రోజులలోనే శ్రీ భారతి స్వామి వారు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారిని వెతుక్కుంటూ హరిహరన్ అయ్యర్ గారి ఇంటికి చేరుకున్నారు. శ్రీ హరిహరన్ అయ్యర్ గారి ఇంట్లో కొంత విశ్రాంతి తీసుకున్న తదుపరి, శ్రీ భారతి స్వామి వారు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారిని కలుసుకునేందుకు మైలాపూర్ సంస్కృత కళాశాలకు చేరుకున్నారు. ఆ కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ భారతి స్వామి వారి తేజస్సుకు మంత్ర ముగ్దులై, సాష్టాంగ నమస్కారము చేసి, శ్రీ భారతి స్వామి వారి రాకకు గల కారణాన్ని తెలుసుకొని, వారే స్వామ్యముగా శ్రీ భారతి స్వామి వారిని శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి తరగతి గదికి తీసుకువెళ్లారు.


సెలవు రోజు కావటంతో, గుంపులుగా కూర్చొని సంభాషించుకుంటున్న విద్యార్థులు శ్రీ భారతి స్వామి వారి రాకతో ఒక్కసారిగా ఆశ్చర్యచకితులై నిశ్శబ్దముతో ఉండిపోయారు. కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ భారతి స్వామి వారు ఆసీనులయ్యేందుకు తగిన ఏర్పాటు చేయగా, విద్యార్థులందరూ వేదపఠనంతో శ్రీ భారతి స్వామి వారికి నమస్కరించారు. శ్రీ భారతి స్వామి వారు, " నా కుమార్తెకి తగిన వరుడు ఈ తరగతి గది లో మీ అందరి మధ్యన ఉన్నారు, వారిని కలుసుకునేందుకు మేము ఇక్కడికి వచ్చాము.", అని చెప్పగానే అక్కడే ఉన్న ప్రధానోపాధ్యాయుడు, ఆ అదృష్టవంతుడు ఎవరా అని ఆలోచించేలోపల శ్రీ భారతి స్వామి వారు, అక్కడ ఉన్న విద్యార్థుల గుంపులో నుండి శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి వైపు తమ వేలుని చూపించి, " మా కుమార్తెను మనువాడబోయేది వారే. రాబోయే ఆరు నెలలలో వారి తండ్రి గారు స్వదేశానికి తిరిగి వచ్చి, కుమారుని కళ్యాణం చేస్తారు. బ్రహ్మానంద గురవే నమః", అని అక్కడ ఒక నీటి కుండపై చేయి పెట్టి, ఆ కుండ లో ఉన్న నీరుని వారు మిఠాయిలుగా మార్చి అక్కడ ఉన్న విద్యార్థులకు ఆ మిఠాయిలు పంచి పెట్టి, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారితో, " మేము మీ ఇంటివద్దనే మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాము. మీ ప్రధానోపాధ్యాయుని అనుమతితో ఇంటికి రావచ్చు." అని చెప్పి శ్రీ భారతి స్వామి వారు అక్కడి నుండి వెళ్లిపోయారు.


శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు


శ్రీ భారతి స్వామి వారిని కలుసుకునేందుకు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు, చెప్పిన విధముగానే ఇంటికి చేరుకోని శ్రీ భారతి స్వామి వారిని దర్శించుకోగా, శ్రీ భారతి స్వామి వారు, " మా కుమార్తెను మీరు చూడాలని అనుకుంటున్నారా? ఇక్కడికి పిలిపించమంటారా? శ్రీ బ్రహ్మానంద గురుదేవుల సంకల్పమైన మా వాక్కుని అనుసరించి ఈ వివాహమును చేసుకునేందుకు మీరు సిద్ధముగానే ఉన్నారా?" అని అడుగగా, అందుకు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు,

"కాలగతిని శాసించే మహనీయుని కరుణకు పాత్రుడనైనందుకు, అటువంటి మహనీయుని వాక్కుని ఆనందంగా శిరసావహించుటయే తప్ప, అందుకు అతీతముగా నేను కోరుకునేది ఏది లేదు."

అని బదులు ఇచ్చారు. శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి మాటలకు సంతృప్తి చెందిన శ్రీ భారతి స్వామి వారు, శ్రీ సుబ్రమణ్య శాస్త్రిగారికి విభూది ప్రసాదముగా ఇచ్చి, తిరిగి సత్తూర్ కి బయలుదేరారు.


శ్రీ భారతి స్వామి వారు చెప్పిన విధముగానే శ్రీ పిచ్చుమని అయ్యర్ గారు స్వదేశానికి తిరిగి వచ్చి వారి సోదరులైన శ్రీ హరిహరన్ గారిని కలుసుకోగా, శ్రీ హరిహరన్ గారు జరిగిన వృత్తాంతం అంతా శ్రీ పిచుమని అయ్యర్ గారికి వివరించారు. వారు ఇరువురు ఈ వివాహమునకు సమ్మతించుకున్న తదుపరి, వారి స్వగ్రామములో ఉన్న బంధువులతో కూడా చర్చలు జరిపి అటు నుండి సత్తూర్ కి వెళ్లి శ్రీ భారతి స్వామి వారి అనుమతి తో వధువును చూసి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు.


మరోవైపు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు వారి చదువును పూర్తి చేసుకొని శ్రీ నీలకంఠ దీక్షితులు గారిని దర్శించుకునేందుకు కల్లడైకురిచ్చికి చేరుకున్నారు. శ్రీ సుబ్రమణ్య శాస్త్రిగారికి శ్రీ విద్యోపదేశం తో అనుగ్రహించేందుకు అదే సరైన సందర్భమని భావించిన శ్రీ నీలకంఠ దీక్షితులు గారు, ఏడు రోజుల పాటు కలశారాధన తో కూడిన ప్రత్యేక పూజలు చేసి, ఏడవ రోజున శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారికి ఆ మంత్రం జలముతో పూర్ణాభిషేకం చేసి శ్రీ విద్యోపదేశం చేశారు. ఆ ఉపదేశ కార్యక్రమం జరిగే సమయానికి శ్రీ నీలకంఠ దీక్షితులు గారి ఇంటికి అరవై మందికి పైగా వేద పండితులు విచ్చేసారు. తిరునెల్వేలి లో ఒక మహా యజ్ఞం పూర్తి చేసుకొని శ్రీ నీలకంఠ దీక్షితులు గారిని కలుసుకునేందుకు వారంతా ఆ రోజు అక్కడికి చేరుకున్నారు. మంత్రోపదేశం పూర్తి అవ్వగానే ఆ వేద పండితులు వేద పఠనం చేస్తూ శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారిని ఆశీర్వదించారు. ఇంతటి అపురూపమైన సంఘటన శ్రీ నీలకంఠ దీక్షితులు గారిని ఆనందోద్వేగానికి లోను చేసింది. ఉపదేశం అయిన మరుసటి రోజు నుండి నలభై ఎనిమిది రోజుల పాటు శ్రీ నీలకంఠ దీక్షితులు గారి ఇంట్లోనే ఉంటూ సాధన చేసుకున్న శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు, ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి మధురైకి చేరుకున్నారు.


శ్రీ భారతి స్వామి వారు మద్రాసుకు వెళ్లి శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారిని కలసి వచ్చినప్పటి నుండి ఆ కల్యాణ సంప్రదింపులు దాదాపుగా ఒక సంవత్సరం పాటు సాగాయి. శ్రీ పిచుమని అయ్యర్ గారి స్వగ్రామమైన రాజపాలయం లో పెళ్లి బృందం సమావేశం అయ్యి, అక్కడి నుండి సత్తూర్ కి వెళ్లి శ్రీ భారతి స్వామి వారితో సంప్రదింపులు జరిపి, శ్రీ భారతి స్వామి వారి ఆదేశానుసారం ఇరువురి కుటుంబాల అంగీకారంతో కళ్యాణం నిశ్చయం చేశారు.


ఆ విధముగా 1925వ సంవత్సరంలో శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారికి శ్రీ భారతి స్వామి వారి కుమార్తె అయిన శ్రీ పర్వతవర్ధని వారితో కళ్యాణం జరిగినది. అప్పుడు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి వయసు 19 ఏళ్ళు కాగా, శ్రీ పర్వతవర్ధని గారి వయసు 12 ఏళ్ళు. ఎంతో వైభవంగా ఐదు రోజుల పాటు రాజపాలయం లో జరిగిన ఆ వివాహ వేడుకకు అయిన ఖర్చు మొత్తం శ్రీ బ్రహ్మానంద స్వామి వారి మఠం భరించింది. దానితో పాటు గా ఎన్నో కానుకలను శ్రీ బ్రహ్మానంద స్వామి వారి మఠం నవదంపతులు బహుకరించింది. అంతే కాకుండా శ్రీ భారతి స్వామి వారి శిష్యులు, భక్తులు, శ్రీ బ్రహ్మానంద స్వామి వారి మఠానికి తరచూ వచ్చే భక్తులు, ఇలా ఎందరో వధూవరులకు ఘనమైన కట్నకానుకలు బహుకరించారు. అలా కల్యాణానికి విచ్చేసిన అతిధులు మధురై లో ఒక నూతన గృహాన్ని శ్రీ భారతి స్వామి వారి తరపున వధూవరులకు బహుకరించారు.


శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఓరియంటల్ సంస్కృత కళాశాల లో శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేయనారంభించారు. ఆ మరుసటి సంవత్సరం శ్రీమతి పర్వతవర్ధని అమ్మ గారు గర్భిణి కాగా, శ్రీమతి మీనాక్షి అమ్మ గారు, శ్రీ భారతి స్వామి వారిని పుట్టబోయే బిడ్డ గురించి కాల జ్ఞానం చెప్పవలసిందిగా కోరుతూ, "మీరు ఒక త్రికాల జ్ఞాని, నా కుమార్తెకు జన్మించబోయేది ఆడ బిడ్డ న? మగ బిడ్డ న?" అని అడుగగా, బిడ్డ పుట్టబోయే రోజు, సమయం వరకు అన్ని వివరములను శ్రీ భారతి స్వామి వారు క్లుప్తంగా చెప్తూ, "మగ బిడ్డ, నా మనవడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖ కాన్పు జరుగుతుంది. బ్రహ్మానంద గురవే నమః " అన్నారు. వారు చెప్పిన విధముగానే, శ్రీమతి పర్వత వర్ధని అమ్మగారు ఒక మగ బిడ్డ కు జన్మను ఇచ్చారు.


మనవడు పుట్టిన ఆనందంలో ఇంటిని శుద్ధి చేసి, వెండి, బంగారు ఉగ్గుగిన్నెలను, ఆభరణాలను కొని, మనవడి రాక కోసం ఎదురు చూస్తున్న శ్రీమతి మీనాక్షి అమ్మ గారిని చూసి శ్రీ భారతి స్వామి వారు, "ఈ ఏర్పాట్లన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఈ శిశువుకు 9 ఏళ్ళ రెండు నెలల పదకండు రోజులు మాత్రమే ఆయుర్దానం ఉంది. ఆ తరువాత కాలం చేస్తాడు. " అని కాలజ్ఞానాన్ని చెప్పగా, శ్రీమతి మీనాక్షి అమ్మగారి ఆనందం అంత ఆవిరి కాగా, బరువెక్కిన గుండెతో, ఎంతో కోపం, దుఃఖం తో వారు శ్రీ భారతి స్వామి వారితో , "మనవడు అల్పాయుష్కుడు అని ఎంతో సర్వ సాధారణంగా చెప్పకలగటమే త్రికాలజ్ఞాని అందుకున్న అత్యున్నత స్థితి కాబోలు." అని బాధను వెళ్ళబుచ్చగా, అందుకు ఎటువంటి సమాధానమివ్వని శ్రీ భారతి స్వామి వారు ఒక చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్లిపోయారు.


అప్పటినుండి శ్రీ భారతి స్వామి వారి భవిష్య వాణి పలికిన విధముగానే, వారికి మరో ఇద్దరు మనవళ్లు, ఒక మనవరాలు జన్మించగా, ఒక మనవడు, మనవరాలు ఊహ తెలియకమునుపే కాలం చెందగా, మరొక మనవడు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేక సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో జన్మించారు. వారి పేరు శ్రీ శంకర్ నారాయణన్. శ్రీ భారతి స్వామి వారి భవిష్య వాణి కి తగ్గట్టుగానే, వారి పెద్ద మనవడు 9వ ఏట కాలం చేశారు. కానీ పుత్ర శోకం శ్రీ సుబ్రమణ్య శాస్త్రిగారికి ఎంతో దుఃఖం ఇచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం పొందేందుకు, జన్మించిన శిశువులు అకాలముగా మరణించడానికి కారణం తెలుసుకునేందుకు, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు కల్లడైకురిచ్చి వెళ్లి శ్రీ నీలకంఠ దీక్షితులు గారిని సంప్రదించారు. శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారితో కలిసి మధురై కి చేరుకున్న శ్రీ నీలకంఠ దీక్షితులు గారు, వారికి కలగబోయే తదుపరి సంతానం ద్వారా లోక కళ్యాణం జరగబోతుంది అని, సాక్షాత్తు శివ స్వరూపులు జన్మించబోతున్నారు అని చెప్పి, శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారితో ఒక సంవత్సరం పాటు పుత్ర కామేష్టి యాగాన్ని చేయించారు. దానినే కామేశ్వర కామేశ్వరి మహా యజ్ఞం అని కూడా అంటారు. శ్రీ లలిత మహా త్రిపుర సుందరి కామేశ్వరిగా, శివుడు కామేశ్వరుని గా ఈ యాగంలో ఆవాహనమై ఉంటారు. ఈ యాగం వల్ల కలిగిన సంతానానికి కామేశ్వరి(ఆడ బిడ్డ), లేదా కామేశ్వర(మగ బిడ్డ) అనే నామముతో అలంకరిస్తారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ యాగాన్ని జరిపించేందుకు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారు మధురై లోని వారి ఇంటిని అమ్మి, ఆ వచ్చిన డబ్బులతో యాగం చేసారు. యాగం పూర్తయిన కొంతకాలానికి శ్రీమతి పర్వతవర్ధని అమ్మగారు గర్భిణి కాగా, ఈ సారి జన్మించబోయే బిడ్డ గురించి శ్రీ భారతి స్వామి వారు శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారితో ఈ విధముగా భవిష్య వాని తెలిపారు,

"పంచమ నక్షత్రం, పంచమి తిథి, పంచమ సంతానంగా ఒక మగ బిడ్డ జన్మించబోతున్నాడు. సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో అన్నిటిని జయిస్తాడు. బ్రహ్మానంద గురవే నమః"

శ్రీ భారతి స్వామి వారు తెలిపిన విధముగానే, 1939వ సంవత్సరం లో నవంబరు 1వ తేదీన, పంచమీ తిథి, పంచమ నక్షత్రమైన మృగశిరా నక్షత్ర ఘడియలలో, ఒక మగశిశువు జన్మించారు. కామేశ్వరన్ వారి నామధేయము.


|| బ్రహ్మానంద గురవే నమః||


 

300 views0 comments

Comments


bottom of page