శ్రీ పూర్ణానంద స్వామి వారు పోచంపాడు ప్రాజెక్ట్ కాలనీ నుండి హఠకేశ్వరం తిరిగి వచ్చాక శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ కాలనీలో వారి భక్త బృందం నానాటికి పెరుగుతు ఉండటం వలన, శ్రీ స్వామి వారు శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో ఉంటే బావుంటుంది అని స్వామి వారిని కోరారు. అలా శ్రీ స్వామి వారు 1973 తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ (సున్నిపెంట గా పిలవబడే) చండీపేటలో స్థిరపడ్డారు. అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటుకు భక్తులు ఎంత ప్రాధేయపడినా, శ్రీ స్వామి వారు మాత్రం వారి విన్నపాలను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు.
1969వ సంవత్సరంలో కలవై లో శ్రీ రాఖాడీ బాబా వారి అనుగ్రహం వలన లభించిన శ్రీ రాఖాడీ బాబా వారి పాదుకలు శ్రీ స్వామి వారి ముఖ్య శిష్యులైన బి.ర్.కే(బి రాధా కృష్ణ మూర్తి) గారి నివాసమునందు ఉంచామని శ్రీ స్వామివారు ఆదేశించారు. ఆ విధముగా బాబా వారి పాదుకలు దర్శించుకునేందుకు దాదాపు మూడు సంవత్సరాల పాటు బి.ర్.కే గారి ఇంటికి శ్రీ స్వామి వారి భక్తులు తరచూ వెళ్లి వస్తూ ఉండేవారు. శ్రీ బాబా వారి పాదుకల దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు గొప్ప అనుభూతి పొందటంతో పాటు, వారి సమస్యలకు పరిష్కారాలు దొరకసాగాయి. శ్రీ స్వామి వారు హఠకేశ్వరం నుండి సున్నిపెంటకు చేరుకున్న కొంత కాలానికి, ఒక రోజు బి.ర్.కే గారు శ్రీ స్వామి వారితో, “స్వామి, గురుపాదుకల దర్శనం చేసుకున్న వారందరు దివ్యమైన అనుభవాలు పొందుతున్నారు, బాబా వారి పాదుకల కొరకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే బావుంటుంది. భక్తులందరికీ కూడా ఒక ఆశ్రమం ఉంటే వచ్చి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది” అన్నారు.
అందుకు శ్రీ స్వామి వారు బదులిస్తూ, “ఆశ్రమం ఏర్పాటు చేయటానికి ఇదొక కారణం దొరికిందా?, నీకు అంత ఇబ్బందిగా ఉంటే పాదుకలు తెచ్చి ఆ రాయి మీద పెట్టు”, అని శ్రీ స్వామి వారికి సమీపాన ఉన్న ఒక రాయిని వారు చూపించారు. ఆ మాటకు ఆశ్చర్యపోయిన బి.ర్.కే గారు,“స్వామి గురుపాదుకలు రాయి మీద ఎలా పెట్టగలం? ఒక పీఠం ఉండాలి కదా!”. అనగా అందుకు శ్రీ స్వామివారు “మా గురువుగారికి ఈ భూమి అంతా పీఠమే” అని బదులిచ్చారు. “మరి దీపారాధన చేసేందుకు నూనె తో పాటు ఇతర సామాగ్రి కావలి కదా స్వామి”, అని బి.ర్.కే గారు శ్రీ స్వామి వారిని అడగగా, అందుకు శ్రీ స్వామి వారు, “సూర్య చంద్రులున్నారు కదా! అవి ఆరని దీపాలు,మా గురుగారి దగ్గెర అంతటి గొప్ప దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి, ఈ సృష్టిలో ఆకలితో ఉన్న ప్రతి జీవికి ఆహారంతో దొరికే సంతృప్తి మా గురువులకు నిజమైన నైవేద్యం”, అని శ్రీ స్వామి జ్ఞాన బోధ చేస్తూ, ఆశ్రమం ఏర్పాటుకు కొన్ని షరతులు విధించారు. ఆశ్రమం కోసం భక్తుల నుండి ధనాన్ని సమీకరించకుండా, ఎటువంటి ఆర్భాటాలూ లేకుండా, కేవలం ఒక గురుపాదుకా క్షేత్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఆశ్రమం ఉండాలని శ్రీ స్వామి వారు మార్గ నిర్దేశం చేశారు.
చాల సందర్భాలలో శ్రీ స్వామి వారు,
“సృష్టికర్త స్వరూపమైన మా గురువులు, సృష్టి చేయకలిగేవారు, ఇచ్చేవారే కాని, తీసుకునేవారు కాదు. గురువనుగ్రహంతో నడిచే క్షేత్రానికి గురువే పాలకుడు, అటువంటి చోట ధనాన్ని సమీకరించటం అంటే అనుగ్రహానికి దూరం అవ్వటమే. ఆ జగన్మాత అనుగ్రహం, ఆదేశం లెనిదే మా వద్దకు ఎవరూ రాలేరు. అన్నపూర్ణా అమ్మ వారు అనుగ్రహిస్తే వచ్చిన వారికి అన్నం పెట్టండి, లేకపోతే దణ్ణం పెట్టండి”
, అంటూ ఉండేవారు.
అలా శ్రీ స్వామి వారి అనుగ్రహంతో రూపుదిద్దుకున్న ఆశ్రమం, కాలంతో పాటు రూపాంతరం చెందుతూ వచ్చింది. ఆశ్రమ కార్యవర్గాన్ని నియమించే సమయానికి ఎంతో యాదృచ్చికంగా శ్రీ స్వామి వారిని దర్శించుకున్న రామి రెడ్డి గారిని, జి.న.ర్(జి నరసింహా రావు) గారిని, ఆశ్రమ చైర్మన్, సెక్రటరీలుగా శ్రీ స్వామి వారు నియమించారు. ఆశ్రమం గురుపాదుకల అనుగ్రహంతోనే నడుస్తుంది అని, ఆశ్రమానికి కార్యవర్గమనేది నామమాత్రమే అని, శ్రీ స్వామి వారు ఆశ్రమ కార్యవర్గానికి ఎన్నో విధాలుగా అనుభవ జ్ఞానాన్ని ఇచ్చారు.
ఆశ్రమం ఏర్పడిన కొంత కాలానికి, అప్పటి ప్రముఖ చలన చిత్ర ప్రచార కళాకారుడు గంగాధర్ గారు శ్రీ స్వామి వారిని దర్శించుకుని, శ్రీ రాఖాడీ బాబా వారి చిత్రపటం గీసే అవకాశం వారికి ఇవ్వాల్సిందిగా కోరారు. శ్రీ స్వామి వారు అందుకు అంగీకారం తెలపగా, ఒంటె చర్మంతో చేసిన కాన్వాస్ పై గంగాధర్ గారు శ్రీ రాఖాడీ బాబా వారి ఒక పాత ఫోటోను ఆధారం చేసుకొని అద్భుతంగా శ్రీ రాఖాడీ బాబా వారి చిత్రాన్ని గీయకలిగారు కాని, బాబా వారి కళ్ళను మాత్రం ఆయన గీయలేకపోయారు. అదే విషయం వారు శ్రీ స్వామి వారికి విన్నవించగా, ఆ చిత్రపటంలో బాబా వారి కళ్ళను శ్రీ స్వామి వారే స్వయంగా గీశారు. సున్నిపెంటలో బాబా వారి పాదుకల కొరకు ఏర్పాటైన ఆశ్రమంలో, బాబా వారి పాదుకలు, భువనేశ్వరి అమ్మ వారి యంత్రంతో పాటుగా బాబా వారి చిత్రపటం కూడా బాబాహాలులో కొలువుతీరింది.
ఒక సందర్భంలో శ్రీ స్వామి వారు ఒక శిష్యునితో బాబా వారి పాదుకల విశిష్టత గురించి చెబుతూ,
” బాబావారు ఆ పాదుకలలో నిక్షిప్తమై ఉన్నారు” అని చెప్పారు.
బాబా హాలులో భక్తులు పొందిన ఎన్నో గొప్ప అనుభవాలలో ఒకటి 1990 తర్వాత చోటు చేసుకుంది. శ్రీ స్వామి వారి అనుగ్రహం చేత ఒక భక్తురాలికి ఆశ్రమంలో కొంత కాలం సేవ చేసుకునే అవకాశం లభించింది. అలా శ్రీ స్వామి వారి సేవలో ఉంటూ నిత్యం సప్తశతి పారాయణం చేసుకుంటున్న ఆ భక్తురాలు ఒక రోజు తన పరాయణ గ్రంధాన్ని బాబాహాలులో మర్చిపోవటంతో, రాత్రి ఆ గ్రంధం కోసం బాబా హాలు తలుపులు తీసింది. తాను తరచూ దర్శనార్థం వెళ్లే బాబా హాలు కొన్ని క్షణాల పాటు ఒక దేవ లోకంలా గోచరించింది. కొన్ని వందలమంది ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపించటంతో, నిబిడాశ్చర్యం తో అక్కడి నుండి ఆమె గదికి పరుగులు తీసింది.
మరిమితులకందని గురు కృప పొందేందుకు అన్ని లోకాలు తపిస్తాయనటానికి ఇదొక ఉదాహరణ.
|| నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ ||
Comments