top of page
Writer's pictureSriswamypoornananda.org

జ్ఞాన వీరులు శ్రీ రాఖాడీ బాబా

శ్రీ సద్గురు పూర్ణానందాయనమః


ఆనందతిలక స్తోత్రం


(శ్రీ సద్గురు పూర్ణానంద స్తోత్రం)


ఓం


ఏలాలవంగ ఘనసార సుగంధమిశ్ర- వాతోర్మికాపులకితాం తనుముద్వహంతీ

యా బాణతీర్థ విపినే విజనే చచార

సా సర్వ మంగళతనూ రమతాత్పురస్తాత్


ఐం


నీలాభ్రచుంబి హరితోన్నత భూజమూలే

కుంభోద్భవాది మునిముఖ్య విహారదేశే

యా మూర్తిరాస గురుణాపి గవేషనీయా

సైవాస్తు చేతసిముదా మమతాపహంత్రీ



హ్రీం


ప్రాణప్రియుడు మధు తరగతి బాబా తీరే

సిద్ధాఖ్య, గహ్వరము బే సుసుఖం నిషణ్ణ

యా మూర్తిరేవ భువనత్రయ దీపినీ సా

భూయోపి మే మనసి మోహమపాకరోతు


క్లీం


కర్పూరం సౌరభభరాంచిత భూరుహాత్త-

హ్రీంకారమూల మధురధ్వని నిత్య పూర్ణే

యా బాణతీర్థ విపినే గురుణా ప్రవాస

సా మూర్తిరస్తు పురతో నయనామృతం మే


సౌః


యా భూషణం, గురు పరాశర మౌనిపాద-

సంచారపూత విపినావృత తామ్రపర్ణి-

కూలస్య, సజ్జన సమంచిత సౌఖ్యదాత్రీ

సా మూర్తిరస్తు పురతః సుకృతి రాశిః


ఇతి ఆనంద తిలక స్తోత్రం అంతర్యామి స్వరూపేణ నివసంతం సదా హృది పూర్ణానందం గురుం వందే పురుషార్థ ప్రదాయకం॥



- కీ.శే.శ్రీ మల్లికార్జున శర్మ గారు



మానవులందరు తమ కంటే శక్తిమంతులై తమకు నచ్చిన మిగిలిన గుణాలు కలవారిని గౌరవిస్తారు. శ్రీ రామచంద్రుడు శివ ధనుర్భంగం, సప్తసాలభంజనం, రావణసంహారం మొదలైన ఘనకార్యములు చేసినందువల్ల, వినయ వాత్సల్యాది సద్గుణాలు కలిగి ఉన్నందువల్ల నేటికి మానవ కోటికి మహా వీరుడై ఆరాధింపబడుతూ ఉన్నాడు. సుగ్రీవుడు మొదలైన సందేహ చిత్తులైన వానరులు శ్రీ రామచంద్రుని సప్తసాల భంజనం, పర్వతం వంటి దుందుభి కాయాన్ని కాలి బొటన వేలితో పది యోజనాల దూరం తన్నడం మొదలైన మహావీర కార్యాలు చేయడం రాముణ్ణి మహావీరుడని కన్నులార చూచాకనే శ్రీ రాముడిని మహావీరుడని అంగీకరించి ఆశ్రయించారని వాల్మీకి రామాయణంలో ఉంది. ఐతే ప్రస్తుతం రాముని వంటి వీరులను వారి ఘన కార్యములను ప్రత్యక్షంగా చూడలేని కొందరు ప్రజలు ఫొటోగ్రఫి ట్రిక్కుల వల్ల,నటనా చాతుర్యంవల్ల వీరుల వలె కనిపించే సినిమా హీరోలను వీరులుగా భావిస్తూ తమలో ఉండే వీరారాధన (హీరో వర్షిప్పింగ్) అనే సహజాతాన్నితృప్తి పెట్టుకుంటున్నారు. ఇది నిజంగా జాలిపడదగిందే.


ఎవరెవరు ఎంత శక్తిని ప్రదర్శిస్తే వారు తరువాతి వారికి మహావీరులుగా, చారిత్రక పురుషులుగా ఆరాధ్యులౌతారు. వారి శక్తిలోని తారతమ్యాలను బట్టి వారి చరిత్ర శతాబ్దాలు, సహస్రాబ్దాలు మానవాళికి పఠనీయమై శ్రీరామచంద్రుని యందు ఉత్తేజ మిస్తుంది.శ్రీరామచంద్రుని యందు సర్వశక్తిమత్వం వ్యక్తమైంది గనుక ఆయన చరిత్ర యైన రామాయణం మాత్రం ఈ భూలోకంలో పర్వతాలు, నదులు ఉన్నంత వఱకు అంటే భూమి ఉన్నంత వరకు కీర్తింపబడుతూనే ఉంటుందని వాల్మీకి మహర్షి వ్రాక్కుచ్చాడు."యావత్ స్థాన్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకే2స్మిన్ ప్రచలిష్యతి." శ్రీ రామచంద్రుని తరువాత భీష్మ ద్రోణులు, భీమార్జునులు, అలెగ్జాండర్ శివాజీ ప్రభ్రుతులు ఎందరు వీరులు చరిత్రకెక్కినా భారతీయులకు శ్రీ రామచంద్రుణ్ణి మర్చిపోయి వారినే శ్రీరామునికి బదులు వీరులుగా ఆరాధించే పరిస్థితి రాలేదు. ఈ విషయమే వాల్మీకి మహర్షి తన రామాయణాన్ని గురించి చేసిన “ యావత్ స్థాస్యంతి గిరయో..." అనే ప్రతిజ్ఞకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నది.


ఆలంకారికులు వీరులను ప్రధానంగా నాలుగు విధాలుగా విభజించారు. యుద్ధ వీరుడు, ధర్మ వీరుడు, దయా వీరుడు, దాన వీరుడు అని వారి పేర్లు. యుద్ధంలో క్రుద్దుడు నిలిచిన శ్రీ రాముని ముందుకు వచ్చి స్తోత్రం చేయడానికి కూడా దేవతలు జంకేవారట! అందువల్ల రాముణ్ణి యుద్ధ వీరుడుగా పరిగణించవచ్చు. అంతేగాక పితృవాక్య పరిపాలనమే ధర్మం కోసం మహాసామ్రాజ్యాన్ని, ప్రజానురంజకమనే ధర్మం కోసం తన ప్రాణాల కంటే మిన్న యైన సీతాదేవిని పరిత్యజించాడు గనుక శ్రీరామచంద్రుడు 'ధర్మ వీరుడు' కూడా అంటారు. ఐతే పరిపూర్ణుడు గనుక శ్రీరామచంద్రునే "సుగ్రీవ, విభీషనాదు"లను శరణాగత వాత్సల్యంతో ఆదుకున్నడు గనుక 'దయ వీరుడుగా', వాలి, రావణాది రాక్షస సంహారానంతరం వారి వారి రాజ్యములను సుగ్రీవ, విభీషణులకే ప్రసాదించాడు గనుక 'దానవీరుడుగా' కూడా నిరూపించవచ్చు. శతృ సంహారం కోసం తన యావచ్ఛక్తీని వినియోగించుకోవడానికి వెనుకాడనివాడు "యుద్ధ వీరుడుని"వ్యవహరింపబడతాడు.అలాగే ధర్మం కొఱకు ఎట్టి కష్ట పరిస్థితులనైన సహించెవాడు “ధర్మ వీరుడని" చెప్పబడతాడు.


పాండవేయుడైన ధర్మరాజును ధర్మ వీరుడని చెప్పవచ్చు ఇతరులను దయతలచడంలో తన ప్రాణాలనైన తృణప్రాయంగా పరిత్యజించేవాడు “దయా వీరుడని" పిలువబడతాడు. శిబి చక్రవర్తి, జీమూతవాహనుడు మొదలైన వారు దయావీరులు. దానం చేస్తా మని ప్రతిజ్ఞ చేసి, ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే దానం చేసి తమ ప్రతిజ్ఞను నిలుపుకునే వారు దాన వీరులుగా పరిగణింపబడతారు. బలి చక్రవర్తి, రంతిదేవుడు, కౌంతేయుడైన కర్ణుడు మొదలైన వారు దానవీరుల శ్రేణికి చెందుతారు


పండితరాయలు అనే బిరుదు వహించిన జగన్నాథుడు తన రసగంగాధర మనే అలంకార గ్రంథంలో యుద్ధవీర, ధర్మవీర దయావీర, దానవీరాలతోబాటు పాండిత్య వీరాన్ని కూడా వీరరస ప్రభేదంగా పరిగణించాడు. అద్భుతమైన తన పాండితీ ప్రకర్షతో పండిత మండలిని వాదించి జయించడం పాండిత్య వీరమన్నాడాయన. సంస్కృత శాస్త్ర రంగంలో అట్టి వీరత్వం ఎంత ప్రదర్శిస్తే పాండితీమంతుడని లెక్కించే పద్ధతి ఉన్నది. నత్కీరుడు పాండితీ అంత వీర రసానికి తగిన నాయకుడు ఇంకా ఎందరో మహానుభావులు.......


ఐతే మాటలాడి జయించడం కంటే మౌనంతో జయించడం ఇంకా ఉత్తమం. జ్ఞాని మాత్రమే మౌనంతో జయింపగలవాడు. జ్ఞానం కలిగి ఉండడమంటే అంతటా, అన్నివేళలా నిండి ఉన్నది “ఆత్మయే" అనే నిశ్చయం పొంది ఉండటం. జ్ఞానం కొరకు వీరులుగా నిలద్రోక్కుకొని తపస్సు చేసినవారిని జ్ఞానవీరులుగా మనం లెక్కించవచ్చు. వశిష్ట, విశ్వామిత్రాది మహర్షులందరూ జ్ఞాన వీరులే. మిగిలిన యుద్ద వీర ధర్మవీర, దానవీర, దయావీర, పాండితీ వీరులందరు జ్ఞానవీరులకు విధేయులుగా ఉంటారు. ధర్మాదివీరులు తమ లక్ష్యం కొడుకు చివఱకు శరీరాన్ని వదలటానికి ఉద్యుక్తులైతే జ్ఞానవీరుడు మొట్ట మొదటనే తాను దేహం కానని తెలిసికొని దేహ వాసన వదలటానికి సాధన ప్రారంభిస్తాడు. అందువల్లనే జ్ఞానవీరులైన వశిష్ఠ,విశ్వామిత్రాదులు గురువులు కాగా ధర్మవీరుడైన రాముడు వారలకు శిష్యుడైనాడు. అలాగే అర్జునుడు శ్రీకృష్ణునికి.


అటువంటి జ్ఞాన వీరుల శ్రేణికి చెందిన ఒక మహాపురుషుడు తమకు ప్రతిరూపమైన అంతేవాసితో ఒక సందర్భంగా అన్నారు. " శివా! ఆ పరమశివుడే ఒక వేళ ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరు కోమంటే మనమేమనాలో తెలుసా?"... “ఏయ్ శివా! నీవు శివుడవా? నేను శివుడనా? శివుడంటే అంతటా నిండి ఉన్న నిరాకార తత్వం.నా రూపంలో ఉన్నది నీవు కావా? నా రూపంలో ఉన్నది నీవే అనే తత్వాన్ని తెలిసికోలేని అజ్ఞానీ! వెళ్ళిఫో! నీ కంటే నన్ను వేఱుగా తలంచి అజ్ఞానంతో నాకు దర్శనమివ్వడానికి వచ్చావే! నేను నీకంటె వేరనే అజ్ఞానం నీకుండగా నాకేమివ్వగలవు? నేను నీకంటే వేరుకాదనే నా జ్ఞానాన్ని నీకిస్తా. దాన్ని తీసుకొని వెళ్ళిఫో!" అని రూపంతో సాక్షాత్కరించిన శివుణ్ణి తరిమివెయ్యాలి శివా!"

ఆహా! జ్ఞాన బ్రహ్మనుండి ఆవిర్భవించిన వేదములు కాని ఇవి సామాన్య వాక్కులా? దైవం ఏ ఆకారమూ, గుణమూ లేనిదనే సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞాన యోగానికి పరమావధి. నిరంతరం జగన్మాత కాళికాదేవి సాక్షాత్కారం పొందుతూ, ఆ దివ్యరూపం ఒక్కక్షణం కనిపించకపోయేసరికి తల్లి కోసం పని పిల్లవాని వలె విలవిలలాడిపోయిన ప్రపంచ ప్రసిద్ధ మహా భక్తియోగిచక్రవర్తి శ్రీరామకృష్ణ పరమహంస చివరకు అన్నారు, " వివేకము ఖడ్గంతో నా జగన్మాత రూపాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేశాను." అని. ఈ విధమైన జ్ఞానస్థితిని పొందిన ఆ జ్ఞానవీరుడికి నిజానికి ఏ పేరూ లేకపోయినా వ్యవహార జగత్తులో "రాఖాడీ బాబా" అనే 'పంచాక్షరి వ్యవహార నామధేయమైంది.


రాఖాడీ బాబా పుట్టుక చేత పవిత్రమైన ప్రదేశం తమిళనాడు లోని నార్త్ ఆర్కాడ్ జిల్లాకు చెందిన "కలవై" గ్రామం. తల్లిదండ్రులు పెట్టిన పేరు "ముని స్వామి". కలవై అంటే "కలసిపోయిన ప్రదేశం" అని అర్థం. జీవాత్ముడు పరమాత్మునితో కలిసి పోవడమనే జీవ బ్రహ్మ సమైక్యానికి సంకేతంగా ఉన్న ఈ గ్రామం జీవబ్రహ్మైక్యాన్ని సాధించిన "రాఖాడీ బాబా"కి జన్మస్థలం కావడం సముచితమేగదా! అంతేగాక శ్రీ కంచి కామకోటి పీఠాధిపతు లైన ఇరువురు జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, శ్రీ మహాదేవేంద్ర సరస్వతి గ్రామాన్నే తమ సమాధికి తగిన స్థానంగా ఎంచుకోవడం ఈ స్థలం యొక్క పవిత్రతను ద్విగుణీకృతం చేస్తున్నది. ఆదిశంకరులే గనుక వృద్ధాప్యదశ వరకు జీవించి ఉంటే ఇలా ఉంటారనిపించే జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (శ్రీ కంచి శంకరాచార్య 68వ పీఠాధిపతులు) ఈ కలవై గ్రామాన్ని ఎంతో కాలం తమ నివాసానికి ప్రీతిపాత్రం చేసికొని 'కలవై' ని మహాతీర్థంగా రూపొందించారు.ఇంత ప్రశస్తమైన పవిత్రమైన కలవై అనే క్షీర సాగరంలో 'రాఖాడీ బాబా ' అనే జ్ఞాన కౌస్తుభమణి ఆవిర్భవించి 'శ్రీ నిత్యానంద మహారాజ్' (గణేష్ పురి, ఠాణే, మహారాష్ట్ర)అనే శ్రీ మన్నారాయణుని హృదయాన్ని అధిష్టించింది. ఫలితంగా ఆ యోగీశ్వరుడి జ్ఞానధనానికి సంపూర్ణంగా వారుసుడైయ్యాడు రాఖాడీ బాబా. నిత్యానంద రాకాళుల గురు శిష్య సంబంధాన్ని గౌడపాద గోవింద భగవత్పాదుల సంబంధంతో ఉపమిస్తేనే సరిపోతుంది. రాఖాడీ బాబా పుట్టింది చాల పేద కుటుంబం. వర్ణం కూడా చాతుర్వర్యానికి ఆవలిది.


అందువల్లనేనేమో రాకాలి చాతుర్వర్ణ్యం ఆవలదైన బ్రహ్మజ్ఞానాన్ని అవలీలగా స్వాధీనం చేసుకోగలిగారు. రాఖాడీ బాబాని సోదరులు బాల్యంలో జీవనోపాధికై ఎద్దుల బండి కట్టుకొని దగ్గర ఉన్న పట్నానికి బాడుగకు తోలవలసిందిగా ఆదేశించారట! కాని ఎందరో బద్ద జీవులు ఎద్దుల వలె సంసారమనే బండికి కట్టబడి, దగ్గరి పట్నమనే మృత్యువును పొందుతూ తిరిగివస్తూ, విషయానంద మనే కొద్ది బాడుగ డబ్బులతో బ్రతకలేక చస్తూ ఉంటే వారిని సంసార విముక్తులను గావించి ఎద్దులవంటి ఆ బద్ధ జీవులను ఆ నందీశ్వరుని సంతానంగా మార్చవలసిన కర్తవ్యంతో అవతరించిన రాఖాడీ బాబాకి అది రుచిస్తుందా?ముడులు విప్పేవాడు ముడులు వేస్తాడా? విశాల ప్రపంచమంతా తన ఇళ్ళైన రాఖాడీ బాబా కలవైలోని చిన్నఇంట్లో ఉండలేక సువిశాల ఘోరారణ్యాల్లో అగస్త్యాది మహర్షులు తపస్సు చేసిన నిర్జన గుహాంతర్భాగాల్లో సంచరించాడు, నివసించాడు సింహానికి మహారణ్యం ప్రీతిపాత్రమైనట్లు బోను కాదుగదా!అలాగే జ్ఞాన సింహకిశోరమైన రాఖాడీ బాబా కి బోనువంటి ఇల్లు రుచించలేదు. భగవాన్ నిత్యానందుల ఆదేశానుసారం మహారాష్ట్రలోని గణేశ్ పురిలోని 'తాన్సా' నదీతీరంలోని అనసూయాశ్రమం రాఖాడీ బాబా కి తపస్థానమైంది. మహాత్ములు తమ శిష్యులలో దాగి ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసేటప్పుడు ఎంత కరుణార్ధ హృదయులుగా కనిపిస్తారో ముక్తికి వారసుల్ని చేయ దల్చుకున్నప్పుడు అంత కఠినంగా వ్యవహరించినట్లు గోచరిస్తారు. కాని నిజానికి ఆ కాఠిన్యమే వారి కృపా సర్వస్వం ఆ విధమైన నిత్యానందుల కృపా సర్వస్వానికి రాఖాడీ బాబా ఆశ్రయ స్థానమైయ్యారు. కటికచీకట్లో నది దాటి ఆయాసంతో గురు దర్శనానికి వచ్చిన రాఖాడీ బాబాని సింహ గర్జన వంటి నిత్యానందుల కంటద్వని ఇలా పరామర్శించింది ." దర్శనానికి వచ్చావా? నీవింకా చావలేదూ? ఇందిగా, ఫో!".


గురువిచ్చిన ఆ ప్రసాదాన్ని తనివిదీర ఆరగిస్తూ ఆ కటిక చీకట్లోనే నడిచారు రాకాళి. నిజానికి గురువంటే ఒక దేహమాత్రుడు కాడనీ సర్వవ్యాపకుడనీ, ఆత్మ రూపుడనీ, దేహమే నేననే స్మృతి నశించడమే చావని ఆ దేశికోత్తముడు ఉపదేశించిన ఉపనిషద్బోధామృతం ఆ శిష్య శేఖరుడికి తప్ప మిగిలినవారికేమి తెలుస్తుంది?


"విద్వానేవ హి జానాతి విద్వజ్జన పరిశ్రమం", అని కదా ఆర్యోక్తి! ఈ విధంగా రాఖాడీ బాబా నిత్యానందుల తపస్సర్వస్వానికి ఉత్తరాధికారియై "రాఖాడీ బాబా" నామంతో వ్యవహరింపబడ్డారు.


జ్ఞానికి భక్తి ఉండదనుకోవడం జ్ఞానులను పరిశీలించపోవడం వలన కలిగే దురభిప్రాయం జ్ఞానియైన ఆదిశంకరాచార్యులు రచించిన స్తోత్రాలు ఆయన మహా భక్త శిరోమణి అని నిరూపిస్తున్నాయి. పరమేస్వరుడి కృపా విశేషం వల్లనే తనకు పరమాత్మతో అభేదం సిద్ధించిందనే కృతజ్ఞత ఆపాదమస్తకం నింపుకొని ఉంటాడు జ్ఞాని. అరుణాచలేశ్వరుని ఉత్సవ విగ్రహం ఊరేగింపుకు వచ్చినపుడు కదలలేని వృద్ధాప్య దశలో ఉన్న భగవాన్ రమణ మహర్షి లేచి నిల్చొని "అప్పకు బిడ్డ ఎప్పుడు విధేయుడు” అని పులకించిపోయారు. అలాగే ఒకసారి అరుణాచల క్షేత్ర ప్రశస్తిని వివరిస్తూ సంతత ధారగా కన్నీళ్ళు కారి గొంతు పెగలక ఏడుపును దిగమ్రింగారు మహర్షి .

అలాగే రాఖాడీ బాబా బా యందు కూడా అవధుల్లేని శివభక్తి నిండి ఉంది. అది అప్పుడప్పుడు తొణికిన సంఘటనలున్నాయి. ఐతే రాఖాడీ బాబా యందు లోక హితార్థం శివాంశ కంటే రుద్రాంశ గోచరిస్తుంది. పరమేశ్వరుడు ఎంతకూ అలవిగాని అజ్ఞాన్ని అజమాయిషీ చేయవలసిందిగా రాఖాడి బాబా ను నియమించినాడనిపిస్తుంది. ఒకసారి తమిళ దేశంలోని పొదిగై కొండ దగ్గరి ఒక దేవాలయ సమీపంలో రాఖాడీ బాబా తీవ్ర తప్పస్సు చేస్తున్నారు.


అప్పుడు వరదలు వచ్చి తామ్రపర్ణీ నది పొంగి ఆయన శరీరం కొట్టుకొని పోతుందేమో అనిపించింది. అక్కడి గ్రామ ప్రజలు వచ్చి తమపై కరుణించి లేచి రమ్మని ఎంతగానో ప్రార్థించారు. అప్పుడు వారికి బాబా చెప్పిన సమాధానమిది, “ ఒరేయ్! నా శరీరం పట్టుకొని పోయి, ముక్కలైతే కానీగాక! భగవంతుడి మీద నా విశ్వాసం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటే సరి!“ ఆహా! భగవంతుని మీద ఇంత విశ్వాసం కలవాణ్ణి మహా భక్త చక్రవర్తిగా మనం ఆరాధించనక్కరల లేదా! తరువాత పొంగి వస్తున్న ఆ తామ్రపర్ని నదినుద్దేశించి ఇలా అన్నారు బాబా, "ఏయ్ గంగా! ఆశ్రమాన్ని అభిషేకించడానికి వచ్చావా?తడిపావుగదా! చాలదూ! నీ సేవకు తృప్తి పడ్డాం! వెళ్ళు." ఈ పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం ఆ గంగా దేవి వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయింది.


రాఖాడీ బాబాకు బియ్యాన్ని గాని మరే ఆహార పదార్థాన్నిగాని మరునాటి కోసమని దాచిపెట్టడం గిట్టదు. ఆ విషయాన్ని గురించి ఆయన అంటారు, “ఎందుకు మనం దాచిపెట్టాలి? ఈ పూట పెట్టిన శివుడు రేపటికి చస్తాడా? అసలు అన్నం పెట్టే బాధ్యత ఆ శివుడిది. వాడి పని మనమెందుకు చెయ్యాలి వాడి పని మనం చేయ వలసినంత అసమర్థత వాడికి లేదే? మనుషులే లేని, పండ్ల చెట్టు గూడా లేని కొండకొమ్ము మీదకు వెళ్ళి మనం కూచోవాలి. అక్కడికైన వాడు తెచ్చి పెట్టగలడో లేదో చూడాలి. ఇంతకంటే వైరాగ్యానికి, భక్తి విశ్వాసాలకు పరమావధిని మనం వినగలమా?





రాఖాడీ బాబా నివసించే ఇల్లు ఆశ్రమంవలె గాకుండా ఒక హెూటలేమో అనిపించేలా ఉంటుంది. వచ్చిన వాళ్ళకు ఉప్మా, చపాతీలు, తేనీరు తయారు చేసి ఇస్తూ ఉండడం ఆయన పద్ధతి.తన దగ్గఱకు వచ్చేవాళ్ళను ఇష్టదైవ రూపాలుగా భావించి ఆయనలా చేస్తూండవచ్చు. ఆ వచ్చేవాళ్ళకు ఆ టిఫిన్లు, టీ ఆయన కృపా ప్రసాదం. ఒకసారి ఎవరో టిఫిన్ కు కావలసిన గోధుమపిండి మినపప్పు అన్నీ తెచ్చి బాబా కిచ్చి, దగ్గర్లో ఉన్న ప్రదేశాలను చూచి తిరిగి వచ్చారట! వారి ఉద్దేశం బాబా తాము వచ్చేసరికి టిఫిన్ రుచిగా తయారు చేసి పెడతారని! ఆహా! అజ్ఞానం ఎంత బలవత్తరమైనది.గురువు ప్రేమతో, కారుణ్యంతో చనువిస్తే ఆయన్ను తమ వంటవానిగా, తమవంటివానిగా పరిగణించేలా చేసిందే! ఐతే సద్గురు మూర్తియైన రాఖాడీ బాబా ముందుగా వారి అజ్ఞానానికి తగిన వేడి వేడి చపాతీలు ఇలా వడ్డించారు. "ఒరేయ్! ఇక్కడ ఎప్పుడో శివుడు వస్తాడని వాడి కోసం టిఫిన్ నిల్వ చేసి ఉంచడం జరగదు. శివుడు ఒక రూపంలో ఇచ్చిపోతే, ఇంకొక రూపంలో వచ్చి తిని పోయినాడు. సమయానికి ఎదురుగా ఉన్నవాడే శివుడు గానీ వేచి చూడవలసినవాడు కాదు". ఇచ్చేవాడు శివుడే గాని తాము కాదనే సత్యాన్ని వారు గుర్తించి ఉoటే ధన్యులే. ఆ విధంగా ఎవ్వరితోను అణుమాత్రమైనా బంధంగాని,మొహమాటంగాని పెట్టుకోకుండా నిర్లిప్తంగా సర్వతంత్ర స్వతంత్రుడుగా వ్యవహరించడమే బాబా లక్షణం.


రాఖాడీ బాబాకు విభూతి అంటే ప్రాణంతో సమానం. వామదేవ మహర్షి వలె నిలువెల్ల విభూతి స్నానం చేసేవారు బాబా. ఆయన విభూతి తత్వాన్ని ఒకసారి ఇలా వివరించారు.


"విభూతి యోగమంటే ఏమిటో తెలుసా? ఈ సృష్టి అనే యజ్ఞంలో నిరంతరం పెద్ద పెద్ద వృక్షాలు, జంతువులు, సమస్తం అనుక్షణం ఆహుతై విభూతిగా మారిపోతున్నాయి.ఈ సృష్టి సర్వాన్ని విభూతిగా మారుస్తున్నది. ఇది పరమేశ్వరుడి ఆనంద లీల. అందుకే నేను ఆనందంగా శరీరమంతా ఈ విభూతిని ధరిస్తాను".

విభూతి ధరించడమంటే ఈ జ్ఞానాన్ని సర్వకాల సర్వావస్థలయందు కలిగి ఉండడమే అన్న విభూతి ధారణ రహస్యం బాబా మాటల్లో ఉపదేశింపబడింది.


ఒక మహాత్ముని తపశ్శక్తి ఎంతమందిని తనంతటి వాళ్ళుగా తీర్చి దిద్దినాడనేదాన్ని బట్టి లెక్కింపబడుతుందిగాని ఆయనకు జనసామాన్యంలో ఎంత పలుకుబడి ఉంది అనే విషయాన్ని బట్టి కాదు. జన సామాన్యంలో కీర్తి రావడం రాకపోవడం అనేది ఆయన దేహం ప్రారబ్ధాలను బట్టి ఉంటుంది.జన సామాన్యంలో అఖండ కీర్తి ప్రతిష్టలు గలవారికంటే, పట్టుమని పదిమందికి గూడా తెలియబడని వాడై ఆధ్యాత్మిక జ్ఞాన పర్వత శిఖరాన్ని అధిరోహించి ఒక మహాత్ముడుండ వచ్చు. అద్వైత మత ప్రవక్తుడని శంకరాచార్యులుకు పేరు వచ్చినట్లు ఆయన గురువైన గోవింద భగవత్పాదాచార్యులకు రాలేదు. ఐతే గోవిందుల గొప్పదనమల్లా తమను మరపించే శిష్యుడైన శంకరాచార్యులు జగత్తుకు ప్రసాదించడమే.


క్షీరసాగరం యొక్క మాహాత్మ్యం ఏమిటంటే అమృతాన్ని అందీయడం ఆ గోవింద భగవత్పాదులు, ఆ క్షీరసముద్రం రాఖాడీ బాబా ఐతే, ఆ శంకరాచార్యులు, ఆ అమృత కలశం మన పూర్ణానంద స్వామీజీయే. క్షీరసాగరాన్ని చేరి మధించి అమృతాన్ని పొందడం మనకు సాధ్యం కాదు. అందువల్ల పూర్ణానందుల కరుణామృతమే సర్వదా మనకు సంసేవ్యం.


జ్ఞాన వీర చక్రవర్తి ఐన రాకాళి బాబా దేహాన్ని లక్ష్య పెట్టకుండా మానవ మాత్రులెవ్వరు ప్రవేశించడానికి వీలుగాని మహారణ్య మధ్యభాగంలోకి పరశురామ స్వామి వలె నిశ్చల తపస్సు సాగించాడానికి వెళ్ళిపోయారు. ఆ ధైర్యం అట్టి వారికే బానిస. "కశ్చిద్ధీరస్సమ్యగాత్మానమైక్షత్" (ఏ ఒక్క ధీరుడో మాత్రమే ఆత్మను సంపూర్ణంగా దర్శించగలడు), అని కదా వేదోక్తి. అందువల్ల ఆయన దర్శనం చేసుకోదలచుకుంటే సంకల్ప వికల్పాలతో నిండిన మన మనస్సనే మహారణ్యంలో బుద్ధి అనే గుహలో హంసనాదాలనే సింహనాదాలతో సదా జాగరూకుడై ఉన్న ఆత్మ అనే జ్ఞాన సింహాన్ని దర్శించవలసిందే. అదే ఆయన నిజమైన దర్శనం అదే ఆయన స్వస్థానం. మనలనందరినీ ఆ మహానుభావుడు స్వస్థానానికి లాక్కొని సదానందాన్ని, పూర్ణానందాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించి అనుగ్రహించాలని ప్రార్ధిద్దాం.


ఇది శ్రీ రాఖాడీ బాబాను గురించిన అసమగ్రమైన పరిచయం.ఆయన్ను గురించి సంపూర్ణంగా వ్రాయడమంటే ఆకాశాన్ని ఎన్ని మూరలున్నదో కొలువ యత్నించడమే.ఆయన్ను గురించి తెలిసిన కొద్దీ మౌనం పెరుగుతుందేగాని మాటలు రావు.ఐతే మల్లికార్జునుడు తన మాటలన్నీ అన్య విషయాల్లో వ్యయం కాకుండా మహానుభావులను గూర్చి మాత్రమే ఉపయోగింపబడాలని ఈ ప్రయత్నం చేశారు."స్తోత్రాణి సర్వా గిరః" కావాలనేదే రచయిత వ్యాసకర్త ఆశయం.


ఈ రచనలోని ప్రాణమంతా శ్రీ పూర్ణానంద స్వామివారిది. ఒక రచయిత కలంతో వ్రాస్తే ఆ రచనకు కర్త ఆ కాలమా?లేక ఆ రచయితా?ఇక్కడ మల్లికార్జున శర్మ కలమైతే దాన్ని కదిలించింది శ్రీ పూర్ణానందులు. 'మేడారం మల్లికార్జున శర్మ' అనేది శ్రీ పూర్ణానంద స్వామివారి కలం పేరు.


-కీ.శే. శ్రీ మేడవరం మల్లికార్జున శర్మ గారు

1,150 views0 comments

Comments


bottom of page